Trending News : రాష్ట్రంలో వైన్ షాపుల కేటాయింపుకు సంబంధించిన ప్రక్రియ దసరా పండుగ తర్వాత ప్రారంభం కానుందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఈసారి సుమారు రూ.3,500 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 2,620 వైన్స్ షాపులు ఉన్నాయి. వీటి కాంట్రాక్ట్ గడువు ముగియడంతో కొత్తగా టెండర్లు ఆహ్వానించనున్నారు. గత రెండేళ్లలో వైన్స్ షాపుల ద్వారా రూ.2,920 కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు చేరిందని అధికారులు వెల్లడించారు.
దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలుగా నిర్ణయించగా, ఈసారి దరఖాస్తుదారుల సంఖ్య మరింత పెరగనుందని అంచనా. 2011లో జారీ చేసిన పాత నియమావళిని అనుసరించడంతో పాటు, కొత్త మార్పులు కూడా చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
కొత్త షాపుల కేటాయింపులో పారదర్శకత కోసం లాటరీ విధానాన్ని అనుసరించనున్నారు. అలాగే, కొత్తగా అనుమతించే షాపుల ప్రదేశాల ఎంపికలో ప్రజా ప్రతినిధులు, స్థానిక పోలీసుల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.
