18/02/2026
"జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ అమీన్పూర్ పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ చేస్తూ రికార్డులు, సిబ్బందిని పరిశీలిస్తున్న దృశ్యం"

జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్‌ గారు 11.09.2025న అమీన్పూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు, లాంగ్ పెండింగ్ కేసులను సమీక్షిస్తూ వాటి చేదనకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ఉండాలని సూచించారు. అధిక ఆస్తి సంబంధిత నేరాలు చోటు చేసుకుంటున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్‌లుగా గుర్తించి నిఘా మరింత బలపరచాలని ఆదేశించారు.

అదే సమయంలో సిబ్బందితో మాట్లాడుతూ — ప్రతి పోలీస్ సిబ్బంది అన్ని వర్టికల్ విభాగాలలో ప్రావీణ్యం కలిగి ఉండాలని, కేటాయించిన పనిని పూర్తి నిబద్ధతతో నిర్వర్తించినప్పుడే వ్యక్తిగతంగా ఎదగగలరని ఎస్పీ పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌ను సందర్శించే ప్రజలకు సిటిజన్స్ ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్ స్పష్టంగా కనిపించేలా ఉంచాలని సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను ఓపికగా విని త్వరితగతిన న్యాయం జరగేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

యువతలో పెరుగుతున్న ఆన్‌లైన్ బెట్టింగ్స్, ఆన్‌లైన్ గేమ్స్ కారణంగా సైబర్ మోసాలు పెరుగుతున్నాయని, ప్రత్యేకించి పటాన్‌చెరు, అమీన్పూర్ ప్రాంతాల్లో ఇవి అధికమైందని ఎస్పీ గమనించారు. సైబర్ క్రైమ్‌లపై అవగాహన కల్పించేందుకు పాఠశాలలు, కళాశాలలు, సోషల్ మీడియా వేదికల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.

అలాగే ఉద్యోగుల రద్దీ, స్కూల్–కాలేజీ బస్సుల వలన ఉదయం, సాయంత్రం ఎక్కువగా ట్రాఫిక్ సమస్యలు వస్తున్నందున ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఎన్ఫోర్స్‌మెంట్ను బలపరచాలని ఎస్పీ ఆదేశించారు.

నేరాల నియంత్రణలో, నేరాల చేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన గుర్తుచేశారు. ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ముఖ్యంగా షాపింగ్ మాల్స్, షాపులు, పెట్రోల్ బంక్‌లు వంటి చోట్ల తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉండేలా చూడాలని సూచించారు.

ఈ సందర్శనలో పటాన్ చెర్వు డీఎస్పీ ప్రభాకర్, అమీన్పూర్ ఇన్స్పెక్టర్ నరేష్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *