
Sangareddy News : సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు ప్రభుత్వాన్ని ఉద్దేశించి రైతుల నుండి పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిందిగా గట్టిగా డిమాండ్ చేశారు.
సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట మార్కెట్ యార్డ్, పెద్దాపూర్ రైతు వేదిక, మల్కాపూర్ PACS కేంద్రం, తోగర్‌పల్లి PACS కేంద్రం లలో యాసంగి (రబి) వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఈ కేంద్రాలు PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా ధాన్యం విక్రయించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.
ధాన్యం తడవకుండా ఉండేందుకు అవసరమైన టార్పాలిన్లు, సేకరణ కోసం గోనె సంచులు పూర్తిగా అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినట్లుగా, మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు అదనంగా రూ.500 బోనస్ ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఈ బోనస్‌ను దొడ్డు రకం ధాన్యానికి కూడా వర్తింపజేయాలని స్పష్టం చేశారు.
రైతులు దళారుల మోసాలకు గురికాకుండా సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హామీలను గుర్తుచేస్తూ, ఎటువంటి ఆంక్షలు లేకుండా పూర్తి స్థాయిలో రైతుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కౌలు రైతులకు రైతు భరోసా పథకం వర్తింపజేస్తామని, ఏకరానికి రూ.7,500 చొప్పున ఏడాదికి రూ.15,000 అందిస్తామని ప్రకటించిన దాన్ని వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వంను కోరారు.