18/02/2026
హైదరాబాద్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల టోల్ ఫ్రీ కాల్ సెంటర్ 1800 599 5991

Latest News : హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల పథక లబ్ధిదారుల సమస్యలు, సందేహాల పరిష్కారం కోసం కొత్త టోల్ ఫ్రీ కాల్ సెంటర్ (1800 599 5991), హెల్ప్ డెస్క్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కాల్ సెంటర్ పనిచేస్తుందని తెలిపారు. లబ్ధిదారుల ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించడానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.

అభ్యర్థుల ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ ఆధారంగా వివరాలను పరిశీలించి సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపడతారని చెప్పారు. నిర్ణీత గడువులో బిల్లులు జమ కాకపోవడం, సిబ్బంది ఫోటోలు అప్‌లోడ్ చేయడంలో ఆలస్యం, సాంకేతిక సమస్యలు, అవినీతి ఆరోపణలు వంటి అంశాలపై నేరుగా ఫిర్యాదులు స్వీకరించి, సంబంధిత అధికారుల వద్దకు తీసుకెళ్లి పరిష్కారం చూపుతామని వివరించారు.

మరింత పారదర్శకత కోసం ఇందిరమ్మ యాప్, కృత్రిమ మేధ (AI) వినియోగాన్ని పెంచామని, ఈ కాల్ సెంటర్ ద్వారా లబ్ధిదారులకు మరింత చేరువ అవుతున్నామని మంత్రి పేర్కొన్నారు. అవినీతికి ఎటువంటి అవకాశం లేకుండా ఇండ్ల నిర్మాణం పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం పేదలకు ఇండ్ల నిర్మాణానికి ₹5 లక్షల సబ్సిడీ అందజేస్తోందని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *