Sangareddy News : జిల్లాలో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలు 11-12-2025న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు జరగనున్న నేపథ్యంలో, ఎన్నికలు శాంతియుతంగా మరియు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయడమైనది.
- మొదటి విడత ఎన్నికల నేపధ్యంలో 163 BNSS (144 సెక్షన్ ) అమల్లో ఉన్నందున ఎన్నికల కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువ వ్యక్తులు గుంపులుగా గుమికూడరాదు.
- పోలింగ్‌కు 44 గంటల ముందు నుండి , అనగా 09-12-2025 సాయంత్రం 5:00 గంటల నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు, సైలెంట్ పీరియడ్ అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఎన్నికల సభలు, సమావేశాలు, ఇంటింటా ప్రచారం, లౌడ్‌స్పీకర్ వినియోగం, ర్యాలీలు, బైక్ ర్యాలీలు పూర్తిగా నిషేధం.
- పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపల, ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లే మార్గంలో లేదా దానికి సంబంధించిన వీధుల్లో ఎలాంటి ప్రచారం, అడ్డంకులు, ఉద్రేకం లేదా ప్రలోభాలను సృష్టించకూడదు.
- పోలింగ్ కేంద్రం నుండి 200 మీటర్ల దూరం లోపల ఎలాంటి బూత్‌లను ఏర్పాటు చేయడానికి అనుమతి లేదు. అభ్యర్థికి లేదా వారి పక్షాన ఒక్క బూత్‌ను మాత్రమే 200 మీటర్ల పరిధికి వెలుపల ఏర్పాటు చేయాలి. ప్రతి బూత్‌కు ఒక టేబుల్ మరియు రెండు కుర్చీలు మాత్రమే అనుమతించబడతాయి. వాతావరణ పరిస్థితుల నుండి రక్షించుకోవడానికి గొడుగు లేదా టర్పాలిన్ ముక్కను ఉపయోగించవచ్చు. బూత్‌ను టెంట్లు లేదా ఇతర మార్గాల ద్వారా మూసివేయడానికి వీలులేదు.
- బూత్‌ల ఏర్పాటుకు సంబంధించి రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా తెలియజేయాలి మరియు స్థానిక అధికారుల నుండి లిఖితపూర్వక అనుమతి తప్పనిసరిగా పొందాలి.
- . బూత్ లో ఇచ్చే చీటీలపై అభ్యర్థి పేరు లేదా గుర్తు లేదా రాజకీయ పార్టీ పేరు ఉండకూడదు. కేవలం తెల్ల కాగితంపై మాత్రమే ముద్రించాలి.
- పోలింగ్ స్టేషన్ ప్రాంగణంలో లేదా 100 మీటర్ల పరిధి లోపల ఫోన్లు, కార్డ్‌లెస్ ఫోన్లు, వైర్లెస్ సెట్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడానికి లేదా తమ వద్ద ఉంచుకోవడానికి అనుమతి లేదు.
- ఎన్నికల భద్రత దృష్ట్యా, మద్యం దుకాణాలు (వైన్ షాపులు) డిసెంబర్ 9వ తేదీ సాయంత్రం 05:00 గంటల నుండి 12వ తేదీ ఉదయం 10:00 గంటల వరకు పూర్తిగా మూసి ఉంచవలెను.
- ఎవరైనా మద్యం అక్రమంగా రవాణా చేసినా, నిల్వ చేసినా లేదా తమ వద్ద ఉంచుకున్నా , వారిపై కేసులు నమోదు చేయబడుతుంది.
- ఓటర్లు పోలింగ్ కేంద్రం లోపలికి గుర్తింపు కార్డ్ ( ఓటర్ కార్డు, ఆధార్ కార్డు etc..) మాత్రమే అనుమతించబడుతుంది. పోలింగ్ కేంద్రంలోకి సిరా (ఇంక్), వాటర్ బాటిళ్లు, కత్తులు లేదా భద్రతా సిబ్బంది అనుమానించే ఇతర ఎలాంటి వస్తువులను కూడా తమ వెంట తీసుకురావడానికి అనుమతి లేదు.
- పోలింగ్ పూర్తయ్యే వరకు పోలింగ్ కేంద్రాల పరిసరాలలో స్థానికేతరులు లేదా బయటి వ్యక్తులు ఎవరూ ఉండరాదు.
- ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే, ఎక్కడా గుమిగూడకుండా వెంటనే తమ నివాసాలకు తిరిగి వెళ్లాలి.
- పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు లేదా ప్రదర్శనలు నిర్వహించడానికి అనుమతి లేదు. నిషేధాన్ని ఉల్లంఘించి ఎవరైనా ర్యాలీలు నిర్వహించినట్లయితే, వారిపై కేసులు నమోదు చేయబడుతుంది.
ఎన్నికలు స్వచ్ఛంగా, ప్రశాంతంగా జరగేందుకు ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలి.
