Sadashivpet News : సదాశివపేట మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ప్రత్యేకంగా అడిగి రూ.200 కోట్ల నిధులు సమకూర్చుతానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. మంగళవారం ఆయన సెక్రటేరియట్లో సంగారెడ్డి, సదాశివపేట మున్సిపల్ పబ్లిక్ హెల్త్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
నీటి సమస్య పరిష్కారానికి కొత్త ప్రణాళికలు
జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా సరిపడా నీటి సరఫరా లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
- సదాశివపేట మున్సిపాలిటీలో కొత్త కాలనీలు ఏర్పడటంతో జనాభా పెరిగినా, ఆ స్థాయిలో నీటి సరఫరా జరగడంలేదని తెలిపారు.
- ఎటిగడ్డ సంఘం వద్ద ఫిల్టర్ బెడ్, సదాశివపేట శివారులో ఇంటెక్ వెల్ ఏర్పాటు చేయాలని సూచించారు.
- ఏటిగడ్డ సంగం బదులుగా నేరుగా సింగూర్ నుంచి నీటిని తరలిస్తే ప్రయోజనం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
11 కొత్త ట్యాంకుల నిర్మాణం
జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని మూడు కాలనీలకు ఒకటి చొప్పున మొత్తం 11 ట్యాంకులు నిర్మించాల్సిన అవసరం ఉందని అధికారులు వివరించారు.
- ప్రతి ట్యాంక్ 6 లక్షల గ్యాలన్ సామర్థ్యంతో ఉండాలని జగ్గారెడ్డి సూచించారు.
- రోజూ ఉదయం, సాయంత్రం రెండు గంటల పాటు నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
- మొదటి అంతస్తు ఇళ్లకు కూడా నీరు ఎక్కేలా ప్రెషర్ డిజైన్ చేయాలని అధికారులకు ఆదేశించారు.
ప్రైవేట్ కన్సల్టెంట్ నియామకం
ప్రాజెక్ట్ డిజైన్ కోసం మున్సిపల్ సిబ్బంది సరిపోరని, అందుకే ప్రైవేట్ కన్సల్టెంట్ను నియమించి డిజైన్ చేయించుకోవాలని జగ్గారెడ్డి సూచించారు.
- కన్సల్టెంట్ ఖర్చు తానే భరిస్తానని ఆయన ప్రకటించారు.
- పట్టణంలో అవసరమైన చోట పాత ట్యాంకులు, డిస్ట్రిబ్యూషన్ లైన్లు బదులుగా కొత్త మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
జగ్గారెడ్డి హామీ
సదాశివపేట మున్సిపాలిటీ అభివృద్ధి, నీటి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రూ.200 కోట్ల నిధులు తెచ్చి ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
