18/02/2026
Veeranari Chakali Ilamma 40th death anniversary celebrations in Sangareddy with officials, public representatives, and leaders paying floral tributes at her statue.

Sangareddy News : సంగారెడ్డి పట్టణంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి బుధవారం ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రశేఖర్, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TG IIC) చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ – తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రలో చాకలి ఐలమ్మ ఒక మహోన్నతమైన స్థానాన్ని సంపాదించారు. ఆమె పోరాట స్ఫూర్తి, ధైర్యం ఈ తరానికి ఆదర్శం. తెలంగాణ ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహించాలనే నిర్ణయం తీసుకోవడం ఎంతో గర్వకారణం అని పేర్కొన్నారు.

ఈ సందర్భముగా టి జి ఐ ఐ సి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ – చాకలి ఐలమ్మ తొలి భూ పోరాటానికి నాంది పలికిన సాహసవనిత. రజాకర్ల అరాచకాలకు ఎదురొడ్డి ఎర్రజెండా పట్టి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారు. అలాగే, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల హైదరాబాదులోని కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా అప్‌గ్రేడ్ చేయడం ద్వారా అమ్మాయిలకు ఉన్నత విద్యలో కొత్త అవకాశాలు కల్పించిందని చెప్పారు. చాకలి ఐలమ్మ సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలిచారని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి జగదీష్, జిల్లా టీజీవో అధ్యక్షుడు డాక్టర్ వైద్యనాథ్, సంగారెడ్డి తహసీల్దార్ జయరాం, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేష్, వెనుకబడిన తరగతుల జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పాటిల్, జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడు కూన వేణు, రజక సంఘ సభ్యులు, వివిధ కుల సంఘాల నాయకులు,సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *