Sadashivpet News : సదాశివపేట మండలంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికారులు,తమ సిబ్బంది పనితీరు భేష్ అని పేట సీఐ వెంకటేశం పేర్కొన్నారు.శుక్రవారం తన కార్యాలయంలో పోలీసు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐమాట్లాడుతూ.. అందరి సమష్టి కృషితోనే పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగాయని తెలిపారు. ‘ఎన్నికల అధికారులు,పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు గ్రామాలను సందర్శించి ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. హోంగార్డు నుంచి అధికారుల వరకూ ఆత్మస్థైర్యంతో పని చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా బాగా కష్టపడి పని చేశారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో పనిచేయాలని’ ఆయన సూచించారు. అనంతరం గతంలో నమోదైన కేసులు, వాటి దర్యాప్తులో సాధించిన పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించిన వారిని ప్రశంసించారు,అభినందించారు.
