Sangareddy News : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ మున్సిపాలిటీల పరిధిలోని పోలింగ్ లొకేషన్లు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను సమీక్షించాలని సూచించారు. గత ఎన్నికల సమయంలో అల్లర్లు సృష్టించిన, చెడు నడత కలిగిన వ్యక్తులను గుర్తించి, సత్ప్రవర్తన కోరుతూ ముందస్తుగా బౌండ్ ఓవర్ చేయాలని అధికారులకు ఆదేశించారు.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు తేది: 28.01.2026 నుండి 30.01.2026 వరకు కొనసాగనున్న నేపథ్యంలో, జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నామినేషన్ కేంద్రాల వద్ద పాటించవలసిన సూచనలు:
• నామినేషన్ కేంద్రం నుండి 100 మీటర్ల పరిధిలో 163 బిఎన్‌ఎస్‌ఎస్ (144 సిఆర్‌పిసి) అమలులో ఉంటుంది. కావున ప్రజలు గుంపులుగా ఉండరాదు.
• నామినేషన్ కేంద్రానికి అభ్యర్థితో పాటు ఒకరు లేదా ఇద్దరు ప్రతిపాదకులను మాత్రమే అనుమతించబడును.
• నామినేషన్ కేంద్రంలో శాంతి భద్రతలు పాటించాలి. నినాదాలు, ప్రచారం పూర్తిగా నిషేధం.
• నామినేషన్ కేంద్రం బయట ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయరాదు.
• నామినేషన్ కేంద్రం పరిసరాల్లో నినాదాలు, లౌడ్ స్పీకర్లు, బ్యాండ్లు వాడకూడదు.
• నామినేషన్ కేంద్రం బయట బ్యానర్లు, ఫ్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేయరాదు.
• ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాలను దూరంగా పార్క్ చేయాలి.
• ఎన్నికల అధికారుల, పోలీసుల ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి.
• నామినేషన్ కేంద్రం పరిసరాల్లో మద్యం సేవించడం లేదా పంపిణీ చేయడం నిషేధం.
• ఇతర అభ్యర్థులను బెదిరించడం, అడ్డుకోవడం వంటి అనైతిక చర్యలకు పాల్పడరాదు.
• ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసిసి)ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి.
• ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున సంబందిత అధికారుల అనుమతి లేనిది ర్యాలీలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించరాదు.
• నామినేషన్ ప్రక్రియకు అంతరాయం కలిగించే విధంగా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం చేయరాదు.
• ఎన్నికల సమయంలో చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది.
• ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించుకునేందుకు జిల్లా ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించాలని జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తోంది.
