Sadashivpet News : మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సదాశివపేట రైతు సేవా కేంద్రంలోని శనగల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం సందర్శించారు. కోటా అయిపోయిందంటూ కొనుగోళ్లు నిలిపివేయడంతో వారం రోజులుగా అక్కడే పడిగాపులు కాస్తున్న రైతుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎందుకు కొనుగోలు చేయడం లేదని అధికారులను నిలదీశారు. హరీశ్ రావు గారి వెంట సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, స్థానిక నాయకులు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు గారు మీడియాతో మాట్లాడుతూ… మండల పరిధిలో ఏటిగడ్డ సంఘం తదితర గ్రామాల రైతులు తమ శనగలు కొనడం లేదని మా దృష్టికి తీసుకురావడంతో, ఇక్కడి డీసీఎంఎస్ సెంటర్ కు రావడం జరిగిందని. రైతులను, నిర్వాహకులను అడిగితే కోటా అయిపోయిందని చెబుతున్నారని పేర్కొన్న రు.ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతులకు విత్తనాలు, ఎరువులు ఇవ్వలేకపోతోందన్నారు.
సకాలంలో రైతుబంధు ఇవ్వకపోగా.. కనీసం పండిన పంటను మద్దతు ధరకు కొనే పరిస్థితిలో కూడా లేదన్నారు. ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి, మంత్రులు గల్లీకి తక్కువ.. ఢిల్లీకి ఎక్కువ అన్నట్లుగా తయారయ్యారని..గాలి మోటార్లలో తిరుగుతూ కేరళ, ఢిల్లీ పర్యటనల్లో ఉన్న బిజీలో వారికి రైతుల కష్టాలు పట్టడం లేదన్నారు
భూమి మీద తిరుగుడు తక్కువైపోయి గాలి మోటార్ల తిరుగుడు ఎక్కువైపోయిందన్నారు.సదాశివపేటలో కొత్తగా శనగలు కొనకపోగా, ఇప్పటికే కొన్న శనగలను కూడా బిల్లులు కావడం లేదని బస్తాలు ఖాళీ చేసి రైతులకే వెనక్కి ఇచ్చేస్తున్నారన్నారు.
వారం రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నామని మొగలయ్య లాంటి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని ..ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలనీ.మార్కెటింగ్ శాఖ మంత్రి, సివిల్ సప్లైస్ మంత్రి, ముఖ్యమంత్రి ఎక్కడికి పోయారని ప్రశ్నించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 60 వేల క్వింటాళ్ల శనగలు రైతుల దగ్గర ఉన్నాయనీ ..వెంటనే రూ. 5870 మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలన్నారు.లేదంటే రైతులు బయట అమ్ముకుని క్వింటాల్ కు రూ. 1000 చొప్పున, ఎకరానికి పది వేల రూపాయలు నష్టపోతారన్నారు.రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల్లో మక్కజొన్న పండితే, సగం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం కాలేదన్నారు.
సంచులు లేవని, టోకెన్లు ఆపేశారని చెబుతున్నారని… మద్దతు ధర రూ. 2400 ఉంటే రూ. 1600-1700 కే అమ్ముకుని రైతులు మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జొన్నల కొనుగోలుపై ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయమే తీసుకోలేదన్నారు. ఆరుగాలం కష్టపడ్డ రైతులు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్లి సగం ధరకే జొన్నలు అమ్ముకునే దుస్థితి వచ్చిందన్నారు. వడ్లు కూడా రోడ్ల మీదనే ఉన్నాయన్నారు.
ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ లో ప్రతి పంటకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్.. ఇప్పుడు బోనస్ ఎగ్గొట్టి ఆ మాటను బోగస్ చేసిందన్నారు.
మక్కలు, కందులు, శనగలు, జొన్నలకు బోనస్ ఇవ్వడం లేదని. కనీసం సన్న వడ్లకైనా ఈ యాసంగిలో బోనస్ ఇస్తారా లేదా స్పష్టం చేయాలన్నారు.. గత యాసంగి బోనస్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
భూములు, కాంట్రాక్టులు, కమిషన్ల మీద రివ్యూలు చేస్తారు తప్ప గరీబ్ రైతుల కోసం మీకు సమయం దొరకదా?
కొనుగోళ్లు ఆగిపోయాయన్న కనీస సమాచారం మీ ఇంటెలిజెన్స్ మీకు చెప్పడం లేదన్నారు.
ఇక్కడ మల్లేషం అనే రైతు చెబుతున్నాడు.. రోజుకు కేవలం 10 గంటల కరెంటే ఇస్తున్నారని.
పొద్దున ఎనిమిదింటికి కరెంటు వస్తోందని రైతులు వాపోతున్నారు. కరెంటు ఇవ్వరు, రైతుబంధు వేయరు, బోనస్ ఇవ్వరు, పండిన పంటను మద్దతు ధరకు కొనరు.. అని ఆయన వివరించారు.
మీ ప్రభుత్వం రైతుల కోసమా? లేక కాంట్రాక్టర్లు, దళారుల కోసమా?
ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి జొన్నలు, సన్ ఫ్లవర్, వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలనీ కోటా పేరుతో ఆగిపోయిన శనగల కొనుగోలును వెంటనే తిరిగి మొదలుపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాస్థాయి , నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి బి.ఆర్ ఎస్ పార్టీ నాయకులు
రైతులు తదితరులు పాల్గొన్నారు.
