Sadashivpet News : సదాశివపేట పట్టణానికి సంబంధించి 60 వేల జనాభాకు ప్రతిరోజూ 21 లక్షల గ్యాలెన్ల మంచినీళ్లు అవసరం కాగా.. కొత్తగా నిర్మించే వాటర్ స్కీమ్ లో 52 లక్షల గ్యాలెన్ల నీళ్లు అందుబాటులో ఉంటాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పేర్కొన్నారు.గురువారం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ లు, మున్సిపల్ కమిషనర్, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అధికారులతో వివరంగా వారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 50 సంవత్సరాల వరకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుచూపుతో ఈ స్కీమ్ ఉండాలని అధికారులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.ఈనెల 17న వాటర్ ప్రాజెక్టు గురించి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చించాలని ఆదేశించారు.రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల కౌన్సిలర్ల అభిప్రాయాలు, వారి వార్డుల్లో సమస్యలను నమోదు చేసుకోవాలని వారు చెప్పారు.ఈనెల 18వ తేదీన ఎంపీ, ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా కలిసి వారి అభిప్రాయాలు సైతం తీసుకోవాలన్నారు.చివరగా ఈనెల 19న సదాశివపేట ప్రజల అభిప్రాయాలను సేకరించి ఏవైనా మార్పులు,చేర్పులు ఉంటే పరీక్షించాలని అన్నారు.అదేరోజు ఫైనల్ రిపోర్టు ను తమకు అందిస్తే మరుసటి రోజు సీఎం రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్తామ ని అన్నారు.
ప్రాజెక్టు విలువ రూ. 135 కోట్లు అంచనా వేసినప్పటికీ .. ప్రజాభిప్రాయం ఆధారంగా ఆ విలువ పెరిగినా ఇబ్బంది లేదని వారు వివరించారు.ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు అత్యవసరమైనందున ముందుగా తాగునీటి సమస్య పరిష్కరించి.. ఆ తర్వాత పేదలకు ప్లాట్లు, వార్డుకు రూ.8 కోట్ల చొప్పున అభివృద్ధి నిధుల గురించి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకుందాం..అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.వాటర్ స్కీమ్ కు ఆమోదం రాగానే టెండర్లు పిలిచి రెండేళ్లలో పనులన్నీ పూర్తి పూర్తి చేస్తామని ప్రజలకు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమంలో సి డి సి చైర్మన్ రామ్ రెడ్డి,మున్సిపల్ చైర్ పర్సన్ అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రేణుక చిరు, మున్సిపల్ కమిషనర్ శివాజీ, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
